: సెబీ దెబ్బకు డీఎల్ఎఫ్ విలువలో రూ.7.5 వేల కోట్లు ఆవిరి!
రియల్ ఎస్టేట్ రంగంలో భారత అగ్రగామి సంస్థగా ఎదిగిన డీఎల్ఎఫ్ ఆస్తుల విలువ, కేవలం ఒకే ఒక్క రోజులో నాలుగో వంతు ఆవిరైపోయింది. తొలిసారి ఐపీఓకు వచ్చి రికార్డు స్థాయిలో పెట్టుబడులను సాధించిన డీఎల్ఎఫ్ పై మూడేళ్ల పాటు నిషేధం విధిస్తూ సెబీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజులోనే ఆ కంపెనీ మార్కెట్ విలువలో రూ. 7,500 కోట్ల మేర ఆస్తులు కనుమరుగైపోయాయి. మంగళవారం మార్కెట్ ప్రారంభం కాగానే కేవలం గంట వ్యవధిలోనే డిఎల్ఎఫ్ షేరు విలువ దాదాపు 26 శాతం పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా అంతే మొత్తంలో కుంగిపోయింది. ఈ కారణంగా డీఎల్ఎఫ్ లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు తీవ్ర నష్టాలు చవిచూశారన్న వార్తలు వినిపించినప్పటికీ, సంస్థలో ప్రమోటర్ల వాటా 75 శాతం ఉన్న నేపథ్యంలో మదుపరులపై స్వల్ప ప్రభావమే పడి ఉంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.