: రూ.5 వేల నోటు అవాస్తవమే!: ఆర్ బీఐ
ఇప్పటికే రూ.500, రూ. 1,000 నోట్ల ప్రవేశంతో దేశంలో దొంగనోట్లు విచ్చలవిడిగా చెలామణి అవుతున్నాయి. ఈ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆటుపోట్లకు గురవుతోంది. బంగ్లాదేశ్ మీదుగా దేశం చేరుతున్న పాక్ దొంగనోట్లలో రూ.500, రూ.1,000 నోట్లే ఎక్కువగా ఉంటున్నాయి. దీనిని అరికట్టడానికే పోలీసులు నానా తంటాలు పడుతుంటే, తాజాగా ఆర్ బీఐ నుంచి రూ. 5 వేల డినామినేషన్ తో ప్రత్యేకంగా కరెన్సీ నోట్లు జారీ కానున్నాయన్న వదంతులు సోమవారం ఉదయం నుంచే జోరుగా ప్రచారం సాగింది. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ ప్రచారంలో మంగళవారం కొత్తగా ఓ సదరు రూ. 5 వేల నోటు నమూనాగా పేర్కొంటూ, ఓ పోస్ట్ కూడా జతకలిసింది. అయితే దీనిపై వేగంగా స్పందించిన ఆర్ బీఐ అధికారులు అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. రూ.5 వేల డినామినేషన్ లో కరెన్సీని ముద్రించడం లేదని వారు స్పష్టం చేశారు. 1950 ప్రాంతంలో రూ.5 వేల తో పాటు రూ.10 వేల నోట్లు కూడా చెలామణిలో ఉండేవని, 1967 లో వాటిని వెనక్కు తీసుకున్నట్లు ఆర్ బీఐ వెబ్ సైట్ వెల్లడిస్తోంది.