: మహారాష్ట్రలో మోడీ లక్ష్యం 165 సీట్లు!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 165 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహించారు. ఈ నెల 15న జరగనున్న ఎన్నికలకు సంబంధించిన ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ, మొత్తం 27 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 165 సీట్లను సాధించడం ద్వారా స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది మోడీ యోచన. కేంద్రంలో మాదిరిగానే మహారాష్ట్రలోనూ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల ప్రజలనూ ఆకట్టుకునేలా మోడీ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని పదవిలో ఉన్నా మిగిలిన పార్టీల నేతల కంటే కూడా మోడీ అధిక సంఖ్యలో బహిరంగ సభల్లో పార్టీ తరఫున ప్రచారం చేశారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తీరులోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించనుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో పార్టీ అధికారం చేపడితే ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ఎంపికయ్యే అవకాశాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయి.