: నేటి నుంచి తుపాను బాధితులను ఓదార్చనున్న జగన్... 'సైకిల్' ఎక్కడానికైనా సిద్ధం!
వైకాపా అధినేత జగన్ మరో ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. తుపాను విలయ తాండవం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేటి నుంచి ఆయన పర్యటన కొనసాగనుంది. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండబోతున్నారు. పర్యటన సందర్భంగా, తుపాను బాధితులను స్వయంగా కలుసుకుని, వారి కష్టసుఖాలు తెలుసుకుని, వారిని పరామర్శించడమే జగన్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ కీలక నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి రాజమండ్రి వరకు జగన్ విమానంలో వెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. రోడ్డుపై కారు వెళ్లడానికి అవకాశం లేకపోతే మోటార్ బైక్ పై వెళతారు. అది కూడా సాధ్యంకాని పక్షంలో సైకిల్ పై అయినా సరే జగన్ ప్రయాణిస్తారు. వీలుకాని పక్షంలో ఎడ్లబండ్లను కూడా వినియోగిస్తామని ధర్మాన చెప్పారు. ఓ వైపు ప్రజలను పరామర్శిస్తూ... మరోవైపు సహాయక చర్యలను ముమ్మరం చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని తెలిపారు. తుపాను నేపథ్యంలో, ఈ నెల 16న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టాలనుకున్న నిరసన కార్యక్రమాలను వైకాపా రద్దు చేసుకుందని వెల్లడించారు.