: బీజేపీ ప్రకటనగా మోడీ 'మాడిసన్ స్క్వేర్ ప్రసంగం'... కాంగ్రెస్ ఫిర్యాదు
గత నెల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్కులోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం ప్రస్తుతం వివాదాస్పదమైంది. బాగా పాప్యులర్ అయిన ఆ ప్రసంగాన్ని భారతీయ జనతా పార్టీ ప్రకటనగా రూపొందించింది. ఆ యాడ్ ను హోర్డింగులు, వీడియో రూపంలో మరాఠీ ఛానల్స్ లో పునఃప్రసారం చేయించింది. మరో రెండు రోజుల్లో (బుధవారం) మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రసంగాన్ని రీటెలికాస్ట్ చేయించడంపై మహారాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖలు పంపింది. ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది. బీజేపీ నేత వినయ్ సహస్ర బుద్దే మాట్లాడుతూ, "మోడీ మాడిసన్ స్క్వేర్ ప్రసంగం ప్రైవేట్ ది. బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన కార్యక్రమం అది. అంతేగానీ, అదేమీ ప్రభుత్వ కార్యక్రమం కాదు" అని అన్నారు. ప్రధానమంత్రి హోదాలో మోడీ చేసిన ప్రసంగాన్ని పార్టీ ప్రచార సాధనంగా బీజేపీ వినియోగించకూడదని పలువురు హస్తం నేతలు అంటున్నారు.