: 'సింగం', 'దబాంగ్' పాత్రల్లా డ్రెస్ చేసుకుని సస్పెండయ్యారు!


సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో నటీనటులను అనుకరిస్తూ చిన్నపిల్లలు ఇంట్లో సందడి చేస్తుంటారు. పాపం, ఆగ్రాలో ఇద్దరు పోలీసులు కూడా ఇలానే చేసి సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఆగ్రా జోన్ ఐజీ సునీల్ కుమార్ గుప్తా ఇన్ స్పెక్షన్ కు వచ్చిన సందర్భంగా మనీష్ సోలంకి, భూపేంద్ర సింగ్ అనే కానిస్టేబుళ్ళు విచిత్రంగా కనిపించారు. ఆ ఇద్దరిలో ఒకరు డార్క్ గాగుల్స్ పెట్టుకుని సింగంలో అజయ్ దేవగణ్ ను తలపించగా, మరొకరైతే, కనీసం కాలు ఫ్రీగా కదల్చ వీల్లేనంత టైటు ప్యాంటు ధరించి దబాంగ్ లో సల్మాన్ ఖాన్ ను గుర్తుకు తెచ్చాడట. వీరి డ్రెస్సింగ్ శైలిపై ఐజీ సునీల్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగం, దబాంగ్ లా డ్రెస్ చేసుకోవద్దని, పోలీసు నియమావళికి లోబడి డ్రెస్ చేసుకోవాలని ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న సీనియర్ ఎస్పీ శలభ్ మాధుర్ వెంటనే ఆ ఇద్దరు కానిస్టేబుళ్ళను క్రమశిక్షణ రాహిత్యం కింద సస్పెండ్ చేశారు. నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడం, టైట్ ప్యాంట్లు పోలీసు యూనిఫాంలో భాగం కాదని ఎస్పీ అన్నారు. అనంతరం, జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో యూనిఫాం డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశారు. కాగా, రెండేళ్ళ కిందట ఈ కానిస్టేబుళ్ళను టూరిజం పోలీస్ విభాగానికి కేటాయించారు. టూరిజం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ సుశాంత్ గౌర్ మాట్లాడుతూ, వీరిద్దరూ మంచి పనితీరు కనబరుస్తారని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News