: ఎంత రాత్రయినా సీఎం విశాఖ చేరుకుంటారు: పరకాల ప్రభాకర్
తుపాను సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత రాత్రయినా విశాఖకు చేరుకుంటారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్పష్టం చేశారు. రేపటి నుంచి బాబు విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పరకాల మాట్లాడుతూ, రేపు మధ్యాహ్నం కల్లా మంత్రులందరూ విశాఖ చేరుకోవాలని సీఎం ఆదేశించారని చెప్పారు. సీఎస్, డీజీపీ కూడా విశాఖ వస్తారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరికాసేపట్లో విశాఖ చేరుకుంటాయని, ప్రజల నుంచి నష్టం వివరాలు అందితే సేవలు వేగంగా అందించే వీలుంటుందని అన్నారు. సర్కారు రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీల సాయంతో ప్రభావిత ప్రాంతాలను గుర్తించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. విదేశాల తరహాలో జీపీఎస్ ద్వారా ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తున్నామని చెప్పారు. గూగుల్ మాప్స్ సహకారం కూడా తీసుకుంటున్నామని అన్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరి వెళ్ళారు. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అధికారులు బాబుకు సూచించారు. అయితే, ఆయన అవకాశమున్నంత వరకు రోడ్డు మార్గం ద్వారా విశాఖకు చేరుకునేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు.