: ఐసీసీ నుంచి కళ్ళు చెదిరే కాంట్రాక్టు దక్కించుకున్న స్టార్ గ్రూపు
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చరిత్రలోనే అతి భారీ కాంట్రాక్టును స్టార్ ఇండియా, స్టార్ మిడిల్ ఈస్ట్ సంస్థలు చేజిక్కించుకున్నాయి. ఈ తాజా కాంట్రాక్టు ఒప్పందం మేరకు 2015 నుంచి ఎనిమిదేళ్ళ పాటు ఐసీసీ ఈవెంట్ల ప్రసార హక్కులు స్టార్ కు చెందుతాయి. ఈ ఈవెంట్లలో రెండు వన్డే వరల్డ్ కప్ టోర్నీలు, రెండు చాంపియన్స్ ట్రోఫీలు, రెండు వరల్డ్ టి20 టోర్నీలు ఉన్నాయి. దుబాయ్ లో రెండో రౌండ్ సమావేశం అనంతరం ఈ కాంట్రాక్టు వివరాలు వెల్లడించారు. అంతకుముందు లండన్ లో జరిగిన తొలి రౌండ్ సమావేశంలో ఈ కాంట్రాక్టు విషయమై ప్రాథమికంగా చర్చించారు. ఆదివారం నాడు దుబాయ్ లో జరిగిన రెండో రౌండ్ సమావేశానికి ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కూడా హాజరయ్యారు. ఈ భారీ కాంట్రాక్టు కోసం స్టార్ సంస్థ ఎంత చెల్లించిందన్న విషయం మాత్రం బయటికి పొక్కలేదు. మొత్తం 17 సంస్థలు బిడ్లు దాఖలు చేయగా, స్టార్ గ్రూపుకే గ్లోబల్ కాంట్రాక్టు దక్కింది.