: షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ అంటున్న గంగరాజు... నగరానికి చేరుకోని ఆటగాళ్ళు
హుదూద్ తుపాను భారీ నష్టాన్నే కలగజేసినా వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందంటున్నారు ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి గోకరాజు గంగరాజు. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా అక్టోబర్ 14న విశాఖలో మూడో వన్డే జరగాల్సి ఉంది. తుపాను ధాటికి విశాఖలో పలు వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, మ్యాచ్ నిర్వహణ అనుమానంగా మారింది. దీనిపై గంగరాజు మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. స్టేడియంలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థ ఉందని, భారీ వర్షాలు కురిసినా మైదానంలో నీరు నిలిచే అవకాశాల్లేవని తెలిపారు. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారినా, తడిని తొలగించే ఆధునిక యంత్రాలు స్టేడియంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. కాగా, మంగళవారం నాటి మ్యాచ్ కోసం రెండు జట్ల ఆటగాళ్ళు ఈ మధ్యాహ్నం కల్లా నగరానికి చేరుకోవాల్సి ఉంది. విమాన సర్వీసులను రద్దు చేయడంతో వారి రాక కష్టమేననిపిస్తోంది. తుపాను తీవ్రత తగ్గి, విమాన సర్వీసులు పునరుద్ధరిస్తే సోమవారం మధ్యాహ్నం క్రికెటర్లు విశాఖకు వచ్చే అవకాశం ఉంది.