: ప్రేమంటే ఇలాగే ఉంటుంది!
అమెరికా రహస్యాలను లోకానికి వెల్లడిచేసిన 'ప్రజావేగు' ఎడ్వర్డ్ స్నోడెన్ ఇప్పుడు రష్యాలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అరెస్టు చేస్తుందన్న భయంతో ఆశ్రయం కోసం పలు దేశాలను అభ్యర్థించినా ఫలితం లేకపోవడంతో చివరికి రష్యా పంచన చేరాడు. కాగా, స్నోడెన్ గాళ్ ఫ్రెండ్ లిండ్సే మిల్స్ జులైలో మాస్కో వెళ్ళిందట. అగ్రరాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా స్నోడెన్ ను కలవడమంటే సాహసమే మరి! అమెరికాకు చెందిన ఈ పోల్ డ్యాన్సర్ తో స్నోడెన్ ఎంతోకాలంగా ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అమెరికా వీడిన ప్రియుడిని మాస్కోలో ఈ డ్యాన్సర్ కలిసిన విషయాన్ని స్నోడెన్ న్యాయవాది అనతొలీ కుచెరినా తెలిపారు. "ప్రేమంటే ప్రేమే" అని పేర్కొన్న కుచెరినా... స్నోడెన్, మిల్స్ రష్యా వ్యాప్తంగా షికారు చేశారని వెల్లడించారు. థియేటర్లకు వెళ్ళడమే గాకుండా, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా హాజరయ్యారని చెప్పారు. ఆశ్రయం పొందుతున్న స్నోడెన్ కు నైతిక మద్దతు చాలా అవసరమని కుచెరినా అభిప్రాయపడ్డారు.