: పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న భవ్యశ్రీ అదృశ్యం కేసు
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భవ్యశ్రీ అదృశ్యం కేసు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో అదృశ్యమైన భవ్యశ్రీ, క్షేమంగానే ఉన్నప్పటికీ ఆమె ఆచూకీ లభించని నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలను ముగించలేని పరిస్థితి నెలకొంది. అయితే భవ్యశ్రీ ఎప్పటికప్పుడు తన మకాం మారుస్తూ, పోలీసులకు చిక్కకుండా వెళుతున్నట్టు సమాచారం. అయితే ఆమెను కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఈ తరహా పన్నాగం పన్నుతున్నారా? లేక భవ్యశ్రీనే పోలీసులకు దొరకకుండా తిరుగుతోందా? అన్న విషయాలపై స్పష్టత లేదు. దీంతో భవ్యశ్రీ ఆచూకీ లభ్యమైతే గాని పోలీసులు విశ్రమించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా విశాఖ జిల్లా పాడేరులోని ఓ గెస్ట్ హౌస్ లో భవ్యశ్రీ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు హడావిడిగా అక్కడకు చేరుకున్నారు. అయితే ఆమె బస చేసినట్లుగా భావిస్తున్న గదిలో టీవీ ఆన్ లోనే ఉన్నా భవ్యశ్రీ జాడ మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసుల రాకను గమనించిన నేపథ్యంలోనే భవ్యశ్రీ అక్కడి నుంచి వెళ్లి ఉంటారన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు అన్నవరంలోని సెల్ టవర్ పరిధిలో భవ్యశ్రీ సెల్ ఫోన్ సిగ్నల్స్ లభ్యం కావడంతో అక్కడికీ పోలీసులు పరుగులు పెట్టారు. అయితే అక్కడా పోలీసులకు ఆమె జాడ కనిపించలేదు. ఒకానొక సందర్భంలో భవ్యశ్రీ సెల్ ఫోన్ సిగ్నల్స్ గోవాలోని సెల్ టవర్ల పరిధిలోనూ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. దీంతో భవ్యశ్రీ క్షణక్షణానికి ప్రదేశాలు మారుస్తూ పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. నిత్యం టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్న వార్తలను వీక్షిస్తూ భవ్యశ్రీ చిక్కకుండా తిరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.