: వాళ్లిచ్చే డిస్కౌంట్లు మేమివ్వలేకపోతున్నాం...సుప్రీంకోర్టు కెళ్తాం: ట్రేడర్లు
దేశంలో ఆన్ లైన్ కంపెనీల అడ్డగోలు వ్యాపారాన్ని కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, కాంపిటీషన్ కమిషన్ (సీఐఐ)లను ఆశ్రయిస్తామని ట్రేడర్లు హెచ్చరించారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ వంటి వ్యాపార సంస్థలు ఇష్టానుసారం డిస్కౌంట్లిస్తున్నాయని, వాటి కారణంగా రిటైల్ వ్యాపారులు నష్టపోతున్నారని ట్రేడర్లు ఆరోపిస్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రిటైల్ వ్యాపార రంగాలు రెండింటికీ నియంత్రణ సంస్థలు ఏర్పాటు చేయాలని ట్రేడర్లు కేంద్ర వాణిజ్య మంత్రిని కోరారు. ఆన్ లైన్ వ్యాపార పర్యవేక్షణ, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారు కేంద్రాన్ని కోరారు. 'బిలియన్ డే' పేరిట భారీ డిస్కౌంట్లిస్తూ ఆన్ లైన్ విక్రయాలు నిర్వహించారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ రెండు ఆన్ లైన్ విక్రయ సంస్థలు సుమారు పన్నెండు వందల కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించినట్టు సమాచారం. అంత భారీ డిస్కౌంట్లు ఇవ్వలేని రిటైల్ వ్యాపారులు ఆన్ లైన్ విక్రయాల కారణంగా నష్టపోతున్నారని ట్రేడర్లు పేర్కొంటున్నారు.