: ఈ తుపానును విశాఖ తట్టుకుంటుందా?
విశాఖజిల్లా అనగానే మన కళ్ల ముందు సుందర సముద్రతీరం, రమణీయమైన ప్రకృతి కదలాడతాయి. మనోహరమైన దృశ్యాలు, ఎత్తైన కొండలు, అరుదైన వృక్షసంపద... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అరుదైన సహజసంపదల మణిహారం గుర్తుకొస్తుంది. అలాంటి విశాఖపై ప్రకృతి పగబట్టిందా? అన్నట్టు హుదూద్ తుపాను ముంచుకొస్తోంది. దీని ప్రభావం విశాఖపై కేంద్రీకృతమవుతోంది. దీంతో దీని ధాటిని విశాఖ తట్టుకోగలుగుతుందా? అనే అనుమానం సర్వత్ర వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కునేందుకు సర్వసన్నద్ధంగా ఉంది. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగురుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోంచి వచ్చేయాలని, లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచొద్దని, అంతా అప్రమత్తంగా ఉండాలని తుపానును ఎదుర్కొనేందుకు సమాయత్తం చేశారు. పది విపత్తు నిర్వహణా బృందాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సహాయకచర్యల కోసం 9 హెలీకాప్టర్లు సిద్ధంగా ఉన్నాయి. సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. స్కూళ్లు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని సీఎస్ వైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. దీంతో విశాఖ తుపానును ఎలా ఎదుర్కొంటుందోనని అందరూ ఆందోళనతో వున్నారు.