: ప్రభుత్వమే రైతులను రెచ్చగొడుతోంది: ధర్మాన
సరస్వతి పవర్ మైనింగ్ సంస్థ భూములను ఆక్రమించుకోవాలంటూ రైతులను ప్రభుత్వమే ప్రోత్సహించడం సరికాదని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సరస్వతి పవర్ మైనింగ్ లీజులు రద్దు చేయడానికి గల కారణాలు సహేతుకంగా లేవని అన్నారు. ఇలా తరువాతి ప్రభుత్వాలు కూడా కక్ష సాధింపు చర్యలకు దిగితే టీడీపీ పరిస్థితి ఏంటనేది గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో పరిశ్రమలు స్థాపించాలని పిలుపునిస్తుండగా, ఏపీలో ఏర్పాటు చేస్తామన్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కొర్రీలు పెడుతోందని ఆయన విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించిన మిగతా కంపెనీల అనుమతులు ఎందుకు రద్దు చేయలేదన్న ఆయన, సరస్వతి పవర్ మైనింగ్ సంస్థ కొనుగోలు చేసిన భూములను ఆక్రమించుకోవాలంటూ ప్రభుత్వం పిలుపునివ్వడం సరికాదని ధర్మాన పేర్కొన్నారు. ప్రజలను ఇలాంటి చర్యలకు ప్రోత్సహించకూడదని ఆయన సూచించారు.