: ఇన్ఫోసిస్ లో దీర్ఘకాలిక పెట్టుబడులకు కారణాలివే!
ఇన్ఫోసిస్, దేశీయ సాఫ్ట్ వేర్ దిగ్గజాల్లో అగ్రగామి. టీసీఎస్ తో పోటీ పడి మరీ తన సత్తా చాటుతూ వస్తున్న ఇన్ఫోసిస్ లో పెట్టుబడి పెట్టిన వారంతా, సుదీర్ఘకాలంగా వాటిని ఉపసంహరించడం లేదు. మొన్నటిదాకా అయితే ఎన్.ఆర్.నారాయణ మూర్తి అంటే భరోసా ఉండేది. మరి నేడు ఆయన దాదాపుగా కంపెనీకి దూరంగానే ఉన్నారు. కొత్త రక్తం వచ్చి చేరుతోంది. అయినా పెట్టుబడిదారులు, తమ పెట్టుబడులను ఇన్ఫోసిస్ నుంచి వెనక్కు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. ఎందుకని ఆరా తీస్తే, పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. వాటిలో ప్రధానమైనది సంస్థ భవిష్యత్తు వృద్ధేనట. అంటే, కొత్త రక్తం కూడా పాతకాపుల మాదిరిగానే సంస్థ వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారు. అంతేకాక వ్యవస్థాపకుల మాదిరే కంపెనీని లాభాల బాటలో పరుగెత్తించేందుకు పక్కాగా ప్రణాళికలు రచించారట. మరోవైపు ఇప్పటికే సంస్థలో ఉన్న షేర్లకు సమాన సంఖ్యలో బోనస్ షేర్లను జారీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉచితంగా లభించే ఈ బోనస్ షేర్లు ఇప్పటికిప్పుడు లాభాలు తెచ్చిపెట్టకున్నా, భవిష్యత్తులో మంచి రాబడులను తెస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్థిక క్రమశిక్షణతో పాటు చేతినిండా డబ్బుల సంచులను పట్టుకుని ఉండటంతో ఇన్ఫోసిస్ ను మించిన సంస్థ మరొకటి లేదట. ఈ కారణంగానే ఇన్ఫోసిస్ లోని వాటాలను అంత త్వరగా ఉపసంహరించుకునేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.