: అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్: రేవంత్ రెడ్డి
ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా విద్యుత్ సమస్యను తీర్చలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. విద్యుత్ శాఖకు కనీసం పూర్తి స్థాయి మంత్రిని కూడా నియమించలేకపోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తీవ్ర విద్యుత్ కొరత ఉంటుందన్న విషయం కేసీఆర్ కు తెలుసని... అయినా దానిపై దృష్టి సారించకుండా ప్రజలను సమస్యల వలయంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ఉద్యమం జరిగిన సమయంలో కథలు చెప్పిన కేసీఆర్... ఇప్పుడు కూడా కథలు చెప్పడానికే పరిమితమయ్యారని విమర్శించారు. కేంద్రం నుంచి విద్యుత్ ను తెచ్చుకోవడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కరెంట్, రైతు సమస్యలపై ఈ రోజు టీటీడీపీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని బస్సు యాత్రతో నిద్ర లేపుతామని రేవంత్ అన్నారు.