: గ్రేటర్ టీడీపీలో ఇక కృష్ణ యాదవ్ కీలక భూమిక!


కృష్ణ యాదవ్ టీడీపీ హైదరాబాద్ నగర శాఖలో ఒకప్పుడే కాదు, ఇప్పుడూ కీలక వ్యక్తే. 2002కు ముందు పార్టీ నగర శాఖలో ఆయన ప్రముఖ పాత్ర పోషించిన విషయం నేటికీ నగరవాసులకు చిరపరిచతమే. పాత బస్తీకి చెందిన కృష్ణ యాదవ్, హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగానే కాక చంద్రబాబు ప్రభుత్వంలో కార్మిక, పశు సంవర్థక శాఖలకు మంత్రిగానూ వ్యవహరించారు. ఇటీవల పార్టీని వీడిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలసి రాజకీయ తెరంగేట్రం చేసిన కృష్ణ యాదవ్, ప్రతి విషయంలోనూ తలసానికి సమానంగానే ఎదిగారు. అయితే అనూహ్యంగా స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని జైలుపాలు కావడంతో ఒక్కసారిగా తెరమరుగయ్యారు. తాజాగా తలసాని టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరడంతో మరోమారు కృష్ణ యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. తలసాని సామాజిక వర్గానికి చెందిన కృష్ణ యాదవ్ తాజాగా మునుపటిలాగే, గ్రేటర్ టీడీపీలో కీలక భూమిక పోషించేందుకు కార్యరంగంలోకి దిగనున్నారు. మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న కృష్ణ యాదవ్, గ్రేటర్ అధ్యక్ష పదవి చేపట్టడంతో పార్టీకి పూర్వ వైభవం రానుందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఎలాంటి భేషజాలకు తావివ్వకుండా అందరితో చక్కగా కలిసిపోయే కృష్ణ యాదవ్ రాకతో పార్టీ మరింత బలపడనుందన్న అంచనాలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News