: రూ.742 కోట్ల దయానిధి మారన్ ఆస్తుల అటాచ్ మెంట్ కు ఈడీ రంగం సిద్ధం!
2జీ కేసులో కేంద్ర టెలికాం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన అనుయాయులకు చెందిన రూ.742 కోట్ల ఆస్తుల అటాచ్ మెంట్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగం సిద్ధం చేస్తోంది. ఈ కేసులో దయానిధి మారన్ పాల్పడిన అక్రమాల విలువ కూడా రూ.742 కోట్లేనట. ఔత్సాహిక పారిశ్రామిక వేత్త శివ శంకరన్, తన ఎయిర్ సెల్ కంపెనీని మ్యాక్సిస్ కు విక్రయించేలా చేసినందుకు మారన్ సోదరులు ఈ మేర ముడుపులు అందుకున్నారని సీబీఐ చార్జిషీట్ లో పేర్కొన్న సంగతి తెలిసందే. సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ఆధారంగానే ఈడీ, మారన్ సోదరుల ఆస్తుల అటాచ్ మెంట్ కు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఈ కేసుకు సంబంధించి మలేసియా, మారిషస్ ల నుంచి అందే సమాచారం ఆధారంగా మరికొంత మేర మారన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసే అవకాశాలు లేకపోలేదని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సదరు సమాచారం కోసం ఈడీ, ఆ రెండు దేశాలకు లెటర్ రొగేటరీలను పంపింది.