: సునంద పుష్కర్... విష ప్రయోగంతో చనిపోయారు: ఎయిమ్స్ వైద్యులు
కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ విష ప్రయోగం కారణంగానే చనిపోయారని తేలింది. ఢిల్లీలోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు నిర్వహించిన పరిశీలనలో ఈ మేరకు వెల్లడైంది. శశి థరూర్ తో పాక్ జర్నలిస్ట్ మెహర్ తరార్ ప్రేమ వ్యవహారం నడుపుతోందని భావించిన పుష్కర్, ఆమెతో ట్విట్టర్ లో సంవాదం చేసిన తర్వాత ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పుష్కర్ మృతదేహానికి శవ పరీక్ష చేయించారు. ఈ నేపథ్యంలో పుష్కర్ శరీర అంతర్భాగాలను పరిశీలించిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, విష ప్రయోగం జరిగిందని అభిప్రాయపడింది. అయితే ఈ నివేదికపై అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు, సదరు నివేదికను మరోమారు పరిశీలించమని ఎయిమ్స్ వైద్యులను కోరారు. పోలీసుల అభ్యర్థన మేరకు రెండోసారి పరిశీలన జరిపిన ఎయిమ్స్ వైద్యులు, విష ప్రయోగం కారణంగానే పుష్కర్ మరణించారని తేల్చారు. ఈ మేరకు వారు తొమ్మది రోజుల క్రితమే పోలీసులకు నివేదిక అందించినట్టు సమాచారం. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన ఈ కేసును పోలీసులు ఏ దిశగా ముగిస్తారో వేచి చూడాల్సిందే.