: హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ అదృశ్యం
హైదరాబాదులో మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యం అయింది. కేపీహెచ్ బీ కాలనీ 7వ ఫేజులో నివాసం ఉండే భవ్యశ్రీ నిన్న ఉదయం ఇంటి నుంచి క్యాబ్ లో ఆఫీసుకు బయలుదేరింది. సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి వస్తూ ఆఫీస్ క్యాబ్ లేదని... ప్రైవేట్ క్యాబ్ లో ఇంటికి వస్తున్నానని భర్తకు మెసేజ్ పంపింది. అయినా, ఎంతసేపటికీ ఆమె ఇళ్లు చేరలేదు. దీంతో, కుటుంబ సభ్యులు ఆమె మొబైల్ కు ఫోన్ చేశారు. అయితే, అప్పటికే ఆమె ఫోన్ స్విచ్చాఫ్ అయింది. దీంతో, ఆమె కోసం కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో తన భార్య అదృశ్యమయిందని ఆమె భర్త చైతన్య కూకట్ పల్లి పోలీసులకు అర్ధరాత్రి సమయంలో ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన భవ్యశ్రీ, చైతన్యలు ప్రేమ వివాహం చేసుకున్నారు. చైతన్య హార్డ్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.