: తలసాని, తీగల టీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయం... సందిగ్ధతలో ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డి!
టీటీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ ఉదయం తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్ ఎమ్మెల్యే), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం ఎమ్మెల్యే), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్ ఎమ్మెల్యే), ధర్మారెడ్డి (పరకాల ఎమ్మెల్యే) కేసీఆర్ ను కలిసిన తర్వాత టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. వీరు కూడా ఉదయం విలేకరుల సమావేశంలో ఇదే విషయం ఖరారు చేశారు. తాజాగా, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డిలు టీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయం కాగా... ప్రకాష్ గౌడ్, ధర్మారెడ్డిల చేరికపై సందిగ్ధత నెలకొంది. తాము కేసీఆర్ ఆహ్వానిస్తేనే ఈ ఉదయం ఆయనను కలవడానికి వెళ్లామని, టీఆర్ఎస్ లో చేరికపై తామింకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మధ్యాహ్నానికి వారు మాట మార్చారు. టీటీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు కూడా ఈ భావనను బలపరిచేలా ఉన్నాయి. తలసాని, తీగల కృష్ణారెడ్డి లు పార్టీ మారుతారని తాము ఎప్పటినుంచో అనుకుంటున్నామని.. ప్రకాశ్ గౌడ్, ధర్మారెడ్డిలు మాత్రం టీఆర్ఎస్ లోకి వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడటం ద్వారా ఏర్పడే నష్టాన్ని కొంతమేరకైనా తగ్గించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే ఆయన ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్ లతో మాట్లాడినట్టు తెలుస్తోంది. చంద్రబాబు మాట్లాడిన తర్వాత ధర్మారెడ్డి, ప్రకాష్ గౌడ్ లు పునరాలోచనలో పడినట్టు సమాచారం.