: 8 వేల రూపాయల మందు లక్షకి పెరగడానికి కారణం మోడీనే!: రాహుల్
ప్రధాని నరేంద్ర మోడీ పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానాలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, కొన్ని అమెరికా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించేందుకు ఔషధ ధరలపై నియంత్రణ ఎత్తివేశారని మండిపడ్డారు. దాని ఫలితంగా 8 వేల రూపాయలకు లభ్యమయ్యే కేన్సర్ ఔషధం ఇప్పుడు లక్ష రూపాయలైపోయిందని ఆయన విమర్శించారు. మధుమేహం ఔషధం ధర కూడా అమాంతం పెరిగిపోయిందని ఆయన తెలిపారు. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు. ఇలా చేస్తూ పోతే కొంత మంది పారిశ్రామికవేత్తల కోసమే దేశాన్ని పాలించే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.