: ప్రైవేట్ సేవల దిశగా భారతీయ రైల్వే!
భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ కలిగిన రైల్వే వ్యవస్థ. ఇప్పటిదాకా ఈ వ్యవస్థలో ప్రైవేట్ సేవల మాటే లేదు. అన్ని రకాల సేవల కోసం సొంత సిబ్బందిని వినియోగిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. భారీ సంఖ్యలో ఉద్యోగులున్న భారతీయ రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ రూపక్పలన కూడా జరుగుతుంది. నిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తున్న ఇండియన్ రైల్వేస్ లో ఇప్పుడిప్పుడే ప్రైవేట్ వ్యక్తులకు చోటు లభిస్తోంది. రైలు టికెట్లను విక్రయించేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అనుమతిస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టికెట్ల విక్రయాల్లో ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న రైల్వేస్, తాజాగా ప్రైవేట్ సంస్థలను తమ టికెట్ల విక్రయానికి అనుమతించడం వెనుక భారీ తతంగమే నడుస్తోందని రైల్వే ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు 50 పెద్ద రైల్వే స్టేషన్లలో పారిశుద్ధ్య పనులతో పాటు కాపలా లేని లెవెల్ క్రాసింగ్ ల వద్ద ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించాలని భావిస్తున్న ఇండియన్ రైల్వేస్ నిర్ణయాలు, సంస్థను ప్రైవేట్ పరం చేసే దిశగా వడివడిగా ముందుకు సాగుతున్నాయని కార్మి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.