: ఎన్సీపీ నేత అజిత్ పవార్ వాహనంలో నగదు స్వాధీనం
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వాహనంలో నగదును ఆ రాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బ్యాగుల్లో తరలిస్తున్న ఈ మొత్తాన్ని ఓటర్లకు పంచేందుకే తీసుకెళుతున్నట్లుగా భావిస్తున్నామని పర్బణీ ఎస్పీ అనంత్ రోక్డే చెప్పారు. ఓ బ్యాగులో పవార్ దుస్తులు, విజిటింగ్ కార్డులతో పాటు రూ. 4 లక్షలు, మరో బ్యాగులో పవార్ సన్నిహితుడి దుస్తులు, రూ. 87 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు. ఈ రెండు బ్యాగులు పవార్, ఆయన సన్నిహితుడికి చెందినవిగానే కారు డ్రైవర్ చెప్పారన్నారు. ఈ నెల 15న రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పలు ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు జరిపిన ఏడు దాడుల్లో రూ. 5 కోట్ల నగదు పట్టుబడింది.