: మహారాష్ట్ర రాజకీయాల్లో తర్వాత తలదూర్చుదురు గానీ, ముందు పాక్ సంగతి చూడండి: మోడీకి సేన సలహా


నిన్నటిదాకా మిత్రులు, నేడు విరోధులు... బీజేపీ, శివసేన గురించే ఇదంతా! పొత్తు కుదరకపోవడంతో, సుదీర్ఘ మైత్రికి స్వస్తి చెప్పి, అసెంబ్లీ ఎన్నికల బరిలో కత్తులు దూసుకుంటున్నాయి ఈ రెండు పార్టీలు. తాజాగా, శివసేన ప్రధాని నరేంద్ర మోడీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆయన భారీ సంఖ్యలో సభలు నిర్వహిస్తే కలిగే నష్టం ఎలా ఉంటుందన్న విషయం సార్వత్రిక ఎన్నికల్లో రుజువైంది. అందుకేనేమో, మోడీని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం నుంచి దేశ వ్యవహారాల వైపు మళ్ళించేందుకు తంటాలు పడుతోంది. ఈ క్రమంలో తన పత్రిక సామ్నాలో పలు వ్యాఖ్యలు చేసింది. ప్రధాని మహారాష్ట్ర రాజకీయాల్లో తర్వాత తలదూర్చవచ్చని, ముందు పాకిస్థాన్ తో సరిహద్దు సమస్యలపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చింది. ఇప్పుడు ప్రధాని చేయాల్సింది రాజకీయాలు కాదని, దేశ భద్రతకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. మోడీ పేర్కొంటున్న 56 అంగుళాల ఛాతీ ఉన్న నాయకులు దేశాన్ని రక్షిస్తారా? లేదా? అన్న విషయం చర్చనీయాంశమేనని సామ్నా సంపాదకీయంలో సేన పేర్కొంది. సరిహద్దుల్లో పాక్ కాల్పులు ప్రధాని 56 అంగుళాల ఛాతీని 5.6 అంగుళాలకు తగ్గించి వేశాయని ఎద్దేవా చేసింది. పాక్ కాల్పుల్లో పౌరులు కూడా చనిపోవడం దురదృష్టకరమని, ఆ విషయాన్ని మోడీ తన ఎన్నికల ప్రసంగాల్లోనూ, అటు, తన ట్వీట్లలోనూ ప్రస్తావించడంలేదని సేన మండిపడింది. ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటూ ప్రశ్నించింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ప్రసంగిస్తూ, దేశాన్ని నడిపించేందుకు 56 అంగుళాల ఛాతీ ఉన్న నాయకులు అవసరమని వ్యాఖ్యానించడం తెలిసిందే. దమ్మున్న నేతలే దేశాన్ని పురోగామి పథంలో నడపగలరన్నది ఆయన వ్యాఖ్యల అర్థం.

  • Loading...

More Telugu News