: లక్ష వాట్సప్ మెసేజ్ లు 'ఝాన్వి' ఆచూకీ చెప్పాయి
ఝాన్వి పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. దీనికి కారణం ఆమె తప్పిపోవడమే. ఝాన్వి తల్లికి పది మంది తోబుట్టువులు. వారందరికీ ఝాన్వి అంటే ప్రాణం. సెప్టెంబర్ 28న న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు తల్లిదండ్రులతో వెళ్లిన ఝాన్వి తప్పిపోయింది. దీంతో ఆమె తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా వెతికి పెట్టాలని కేంద్ర హోం మంత్రిని వేడుకున్నారు. ఏం చేసిన కిడ్నాపర్లు పాపకు హానీ చేసే అవకాశం ఉందని, కిడ్నాపర్ల నుంచి ఫోన్ వచ్చేవరకు వేచి చూద్దామని వారు సలహా ఇచ్చారు. దీంతో తల్లి తోడబుట్టిన వారంతా తలోదిక్కు వెతుకులాట ప్రారంభించారు. అయినా పాప ఆచూకీ లభించలేదు. దీంతో వారు ఫేస్ బుక్ ను ఆశ్రయించారు. కొంత మొత్తం తీసుకుని ఫేస్ బుక్ యాడ్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఫేస్ బుక్, వాట్సప్ లో ఝాన్వి తప్పిపోయిందని, ఆచూకీ తెలిస్తే ఈ ఫోన్ నెంబర్ కు తెలియజేయండి అని యాడ్ వచ్చింది. ఈ యాడ్ కి లక్ష షేర్లు వచ్చాయి. దీంతో ఆ చిన్నారి తప్పిపోయిన విషయం కొన్ని క్షణాల్లో కొన్ని లక్షల మందికి తెలిసిపోయింది. ఈ విషయం కిడ్నాపర్లకు కూడా తెలిసింది. దీంతో పాపను ఎత్తుకెళ్లిన వారు అక్టోబర్ 5న ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలో, పాప పేరు, చిరునామా రాసిన ప్లకార్డును ఆమె మెడలో వేసి వదిలేశారు. దీంతో ఆమెను చూసిన వారు ఝాన్విని క్షేమంగా ఇల్లు చేర్చారు. అయితే, ఎవరో పిల్లలు లేని వారే పాపను ఎత్తుకెళ్లి ఉంటారని, ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు ఝాన్వికి గుండు చేశారని వారు తెలిపారు.