: హైదరాబాద్ లో రేవ్ పార్టీ కలకలం... పోలీసుల వ్యవహారంపై అనుమానాలు
హైదరాబాద్ లో రేవ్ పార్టీ సంస్కృతి శరవేగంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు చేస్తున్నా, కొందరు నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ఈ పార్టీలను నిర్వహిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్రనగర్ పరిసరాల్లోని బాబుల్ రెడ్డి నగర్ లో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఓ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన ఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. ఈ సందర్భంగా ఆరుగురు యువతులతో పాటు పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులో ఉన్నవారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఆదివారం రాత్రే రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు మంగళవారం ఉదయం దాకా, దీనిని బహిర్గతం చేయలేదు. మంగళవారం ఉదయం నిందితులను కోర్టు ముందు హాజరుపరిచినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న బడాబాబులను కాపాడేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు సమాచారం.