: హెచ్ పీ లో 5 వేల ఉద్యోగాల కోత!
కంప్యూటర్, ప్రింటింగ్ పరికరాల తయారీలో ప్రముఖ సంస్థగా ఎదిగిన హ్యూలెట్ ప్యాకార్డ్ (హెచ్ పీ)లో ఐదు వేల మంది ఉద్యోగులపై ఉద్వాసన కత్తి వేలాడుతోంది. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల్లో మరింత వృద్ధి సాధించే దిశగా రెండుగా విడిపోనున్న హెచ్ పీ, తన ఉద్యోగుల్లో 5 వేల మందికి ఉద్వాసన పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. సాధారణంగా సంస్థ కార్యకలాపాలు విస్తరించడం, విడిపోవడం జరిగే సందర్భాల్లో ఉద్యోగాల సంఖ్య పెరుగుతుండటం చూస్తున్నదే. ఆయా సంస్థల విలీనం సందర్భంగానే ఉద్యోగాలపై కోత పడుతున్న విషయమూ తెలిసిందే. అయితే, అందుకు భిన్నంగా రెండు విడిపోనున్న హెచ్ పీలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రాకపోగా, ఉన్న ఉద్యోగులపైనే వేటు పడుతోంది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఉద్యోగాలపై కోత విధించక తప్పడం లేదని సంస్థ చెబుతోంది. తాజాగా ఈ వార్తతో సంస్థలోని ఉద్యోగుల్లో ఎవరిపై వేటు పడుతుందోనన్న ఆందోళన మొదలైంది.