: శశిథరూర్ పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు?
ప్రధాన ప్రత్యర్థి పార్టీ నేతను పొగడ్తలతో ముంచెత్తుతున్న తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ పై బహిష్కరణ వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. 'స్వచ్ఛ్ భారత్ అభియాన్' కార్యక్రమంపై మోడీని శశిథరూర్ పొగిడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీలో మూడు, నాలుగు రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఆయన తన వ్యవహార సరళిని మార్చుకోవాలని సోమవారం కేరళ కాంగ్రెస్ హెచ్చరించింది. అయితే, థరూర్ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన కేరళ కాంగ్రెస్ నేతలు, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట. ఆరెస్సెస్, బీజేపీ విధివిధానాలను కాంగ్రెస్ ఎన్నడూ కీర్తించిన ఘటనలు లేవు. అయితే అందుకు భిన్నంగా శశిథరూర్ వ్యవహరించడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. మరోవైపు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని కీర్తిస్తే తప్పేమిటని థరూర్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేయడం ఖాయంగానే కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది.