: రైతులు రాయితీలు అడగడం లేదు: అబ్దుల్ కలాం
రైతులు రాయితీలు అడగడం లేదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తెలిపారు. అనంతపురం జిల్లాలో వ్యవసాయ మిషన్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు నాణ్యమైన విత్తనాలు, నీరు, విద్యుత్ అందించమని అడుగుతున్నారని అన్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు ఆరు వేల మంది రైతులను కలుసుకున్నానని ఆయన తెలిపారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు నీటి కాల్వ ఏర్పాటు చేస్తే ఏడాది పొడుగునా నీటికి కటకట ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. కల్యాణదుర్గంలో ప్రాధమిక రంగ మిషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందని కలాం తెలిపారు. శాస్త్ర సాంకేతిక సాయంతో రైతులను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, రెండో హరిత విప్లవం రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.