: ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని కేసీఆర్ కావాలనే ఆపేశారు: రేవంత్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడిని దూషిస్తేనో, వెంకయ్యనాయుడిని విమర్శిస్తేనో, ప్రధాని నరేంద్రమోడీని తిడితేనో తెలంగాణ ప్రజల కడుపు నిండదని, సమస్యలు తీరవని టీటీడీపీ శాసనసభాపక్ష ఉపనేత రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రానికి కరెంట్ ను చత్తీస్ గడ్ నుంచి తీసుకువచ్చి విద్యుత్ లోటును పునరుద్ధిరిస్తానని కేసీఆర్ హమీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. అయితే, ఇటీవల ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణ కు కరెంట్ సరఫరా చేయడానికి అవసరమైన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడానికి కాంట్రాక్టును నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ఇద్దామని సంబంధిత అధికారి సూచించాడని, దానికి ఒప్పుకోకుండా, తన అనుచరుడికి ఆ కాంట్రాక్ ఇవ్వాలంటూ కేసీఆర్ ఒత్తిడి తెచ్చారనీ అన్నారు. ఈ ప్రతిపాదనకు, ఆ అధికారి ఒప్పుకోకపోవడంతో కేసీఆర్ ఆయనను వెంటనే బదిలీ చేశాడని రేవంత్ అన్నారు. తనకు కావల్సిన వ్యక్తికి కాంట్రాక్ దక్కే అవకాశాలు లేకపోవడంతో కీలకమైన ఆ ఫైల్ ను కేసీఆర్ పక్కన పెట్టి, చత్తీస్ గఢ్ నుంచి నిర్మించాల్సిన విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని వాయిదా వేశాడన్నారు. దీనికి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఇంటింటీకీ ఉద్యోగం నినాదాన్ని వదిలేసిన కేసీఆర్, తాజాగా ఇంటింటికీ నల్లా నినాదాన్ని ఎత్తుకున్నాడని ఆయన విమర్శించారు.