: పాపం... చంద్రబాబు!
పాపం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంచికి వెళ్తే చెడు ఎదురవుతోంది. ఆయన ప్రమేయం లేకుండానే తెలంగాణలో విలన్ గా మారిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆనందంలో ఉన్న బాబును తెలంగాణ ముఖ్యమంత్రి ధర్మసంకటంలో పడేస్తున్నారు. ఏపీలో ఎలాగూ అధికారంలోనే ఉన్నాం కనుక తెలంగాణ ప్రజలను కూడా మచ్చిక చేసుకుందామని ఎంత సర్ధుకుపోదామనుకున్నా, కేసీఆర్ ఆయన ఆటలు సాగనివ్వడం లేదు. గతంలో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా తనతో కరచాలనం చేసిన చంద్రబాబును మరుసటి రోజే విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కేంద్రంతో కలసి పుల్లలు పెడుతున్నాడని ఆరోపించారు. తాజాగా బీజేపీ నేత దత్తాత్రేయ నిర్విహించిన 'అలయ్ బలయ్' కార్యక్రమానికి హాజరైన కేసీఆర్, చంద్రబాబు ముఖంపై నవ్వు పులుముకుని తప్పనిసరి పరిస్థితుల్లో ఆలింగనం చేసుకున్నారు. అయితే, కాసేపటికే చంద్రబాబు ఓ కర్కోటకుడంటూ కేసీఆర్ విమర్శల వాన కురిపించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి కేసీఆర్ తో ఎలా వేగాలో అర్థంకాక సతమతమవుతున్నారు. తెలంగాణతో వివాదం లేకుండా చేసుకుందామని బాబు ప్రయత్నించడం, కేసీఆర్ ఆ ప్రయత్నాలను నీరుగార్చడం సర్వసాధారణంగా మారాయి. ఎంత సర్దుకుపోతున్నప్పటికీ కేసీఆర్ తమ పార్టీ అధినేతను విమర్శించడాన్ని టీడీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి.