: బిజీ షెడ్యూల్ తో వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నా: సానియా
టెన్నిస్ టోర్నీలతో బిజీగా గడుపుతున్న భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ, తీరికలేని షెడ్యూల్ కారణంగా వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతున్నానని వాపోయింది. ఇటీవలే భర్త షోయబ్ మాలిక్ చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ నిమిత్తం హైదరాబాద్ రాగా, తాను ఆ సమయంలో నగరంలో లేకపోవడం బాధించిందని తెలిపింది. ప్రస్తుతం తన ఆటతీరు సవ్యంగా సాగుతోందని, భవిష్యత్తులోనూ మరిన్ని టైటిల్స్ సాధించడంపై దృష్టి పెడతానని పేర్కొంది. ఆసియా క్రీడల్లో వర్ధమాన ఆటగాడు సాకేత్ మైనేనితో కలిసి ఆడడం ఉత్తేజాన్నిచ్చిందని చెప్పింది. సాకేత్ జోడీగా సానియా ఆసియా క్రీడల టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ స్వర్ణం సాధించడం తెలిసిందే. ఇక, తెలంగాణ బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తుండడం గర్వంగా అనిపిస్తోందని సానియా పేర్కొంది.