: తెలంగాణ రాష్ట్రంలో తండ్రి, బిడ్డ, బావ, బావమరిదే బాగుపడ్డారు!: రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా రైతులకి 8 గంటలు, గృహావసరాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్, ప్రస్తుతం ముక్కుతూ, మూలుగుతూ 3 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నాడని ఆయన విమర్శించారు. విద్యుత్ విషయంలో అంత నిబద్ధత ఉంటే రాష్ట్రానికి అత్యవసరమైన చత్తీస్ గఢ్ విద్యుత్ లైన్ల టెండర్ల ప్రక్రియను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు వాయిదా వేసిందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని రేవంత్ దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, తండాలను పంచాయతీలు చేయడం, 1000 రూపాయల పింఛను, గిరిజన, మైనార్టీ రిజర్వేషన్లు, ఇంటికో ఉద్యోగం లాంటి హామీలను కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గాలికి వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రా వాళ్లను తిడితే తెలంగాణ ప్రజల కడుపు నిండదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తండ్రి, బిడ్డ, బావ, బావమరిదే బాగుపడ్డారని ఆయన కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.