: చంద్రబాబు ఇల్లు ఎందుకు మారుతున్నారంటే...!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం. 65 లో సొంత ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ డబుల్ బెడ్ రూం హౌస్ ను కూల్చివేసి ఆ స్థలంలోనే కొత్తగా ఆధునిక హంగులతో మరో ఇంటిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో గత రెండున్నర దశాబ్దాలుగా తాము ఉంటున్న ఇల్లు చిన్నదిగా ఉండటంతో, ఇంటిని పునర్నిర్మించాలని చంద్రబాబు కుటుంబం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా ఐటీ నిపుణులు, ఇతర పారిశ్రామికవేత్తలు బాబును కలిసేందుకు రెగ్యులర్ గా వస్తున్నారు. ఈ క్రమంలో, చాలామందితో ఆయన రహస్య సమావేశాలను నిర్వహించాల్సివస్తోంది. విఐపీలు, వివిఐపీలతో వన్-టు-వన్‌గా మాట్లాడేందుకుగానీ, వారితో చర్చించేందుకుగానీ ప్రస్తుతం ఉన్న ఇంట్లో మినీ సమావేశం హాలు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. తరచూ మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకుగానీ, రాష్ట్ర అధికారులతో సమీక్ష సమావేశాలకు కూడా ప్రస్తుతం ఉన్న ఇల్లు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలోనే, చంద్రబాబు తాజా నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇటీవల టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు కోసం, మరోవైపు లోకేశ్ కోసం వచ్చే సామాన్యులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులతో ప్రస్తుతం ఉన్న ఇంటిప్రాంగణం కిటకిటలాడుతోంది. ప్రస్తుతం ఉన్న ఇల్లు తమ అవసరాలకు తగ్గట్టుగా లేకపోవడంతో ఈ భవనం స్థానంలో ఆధునిక హంగులతో బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. కనీసం పది పడకగదులు, నాలుగైదు హాళ్లు, వీడియో కాన్ఫరెన్స్‌కోసం ఒక హాలు, దేశ విదేశీ అతిథులతో చర్చించేందుకు ప్రత్యేక హాలు, మీడియా సమావేశాలకు ఒక హాలు, విజిటర్లు వేచి ఉండేందుకు ప్రత్యేక హాళ్లు, విశాలమైన కిచెన్, ఇతర మౌలిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. 2014 చివరిలో కొత్త భవన నిర్మాణం ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు చంద్రబాబు కుటుంబం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ లో లేదా ఫాంహౌస్ లో ఉంటారని తెలుస్తోంది. కుటుంబ సమేతంగా నివాసం ఉండేందుకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ అనువుగా ఉంటుందా? అన్న అంశంపై ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. ఒకవేళ, ఇది కుదరకపోతే గచ్చిబౌలి సమీపంలో ఉన్న తమ ఫాంహౌస్ లో ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లో ఆలోచించి నివాసమార్పిడిపై బాబు నిర్ణయం తీసుకుంటారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.