: మోడీ 'సవాల్' ను స్వీకరించి రంగంలోకి దిగిన సచిన్
'ఐస్ బకెట్ చాలెంజ్' స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చాలెంజ్ లు తెరపైకి వచ్చాయి. తాజాగా, కేంద్రం ప్రారంభించిన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలోనూ ఐస్ బకెట్ చాలెంజ్ విధివిధానాలను చొప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 2న 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో ఆయన చీపురు పట్టి ఊడ్చి తన సంకల్పాన్ని చాటారు. 'స్వచ్ఛ భారత్' చాలెంజ్ లో భాగంగా మోడీ క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, ప్రియాంక చోప్రాలను చాలెంజ్ కు నామినేట్ చేశారు. ప్రధాని సవాల్ ను స్వీకరించిన సచిన్ చెత్తను తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు. 'స్వచ్ఛ భారత్' నినాదం ముద్రించి ఉన్న టీషర్టు ధరించిన సచిన్ పలువురితో కలిసి ఆదివారం రాత్రి ముంబయిలో చెత్తను ఎత్తివేశారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ, ఇదో మహత్తరమైన ఆలోచన అని కితాబిచ్చారు.