: తెలంగాణ భవన్ ను 'టీడీపీ ఆఫీస్' అంటూ సంబోధించిన కేసీఆర్!
టీఆర్ఎస్ పార్టీని స్థాపించకముందు కేసీఆర్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అయితే, టీడీపీలో కొనసాగిన రోజులను కేసీఆర్ ఇంకా పూర్తిగా మరిచిపోనట్టుంది! దీన్ని తెలియచేసే ఓ సంఘటన నిన్న జరిగింది. టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆదివారం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, శాసన సభాపక్షం, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, పార్టీ అధినేత హోదాలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ భవన్ అనబోయి...'మన తెలుగుదేశం ఆఫీస్ మీటింగ్ హాల్ ను మార్చుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్నది సరిపోవడం లేదు' అన్నారు. దీంతో, పార్టీనేతలు ఒక్క క్షణం నివ్వెరపోయారు. కేసీఆర్ మాత్రం ఆ పొరపాటును గుర్తించకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. వెంటనే, పార్టీ నేతలంతా 'తెలుగుదేశం ఆఫీస్ కాదు...తెలంగాణ భవన్' అని గుర్తుచేయడంతో ఆయన సర్దుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు.