: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు, బెంబేలెత్తిపోతున్న ప్రజలు


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రమవుతున్న ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మండు వేసవిని తలపించే విధంగా పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. హైదరాబాద్ లో సాధారణం కంటే 5 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదయ్యింది. సాధారణంగా, ప్రతీ ఏడాది అక్టోబర్ నెలలో హైదరాబాద్ లో 31 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీన్ని సాధారణ ఉష్ణోగ్రతగా లెక్కగడతారు. అయితే, ఆదివారం అనూహ్యంగా నగరంలో 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. నెల్లూరు, రెంటచింతల, అనంతపురం, కర్నూలు, తిరుపతి పట్టణాల్లో అత్యధిక ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కాకినాడ, ఆదిలాబాద్‌లలో 36 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలపైగానే ఉన్నాయి. ఒకవైపు నైరుతీ రుతుపవనాలు నిష్క్రమించడంతో పాటు, ఈశాన్య రుతుపవనాలు రావడం ఆలస్యమవుతుండడమే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అధికారులు పేర్కొన్నారు. గాలిలో తేమశాతం తక్కువగా ఉండటం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉందని అధికారులు అంటున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల నుండి 25 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఆరోగ్యవరంలో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అత్యధిక ఉష్ణోగ్రతలు మరో రెండు మూడు రోజులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలావుంటే, అధిక ఉష్ణోగ్రతలకు తోడు, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండడంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News