: ఈ సారి వేదిక బయటే ‘చేతులు’ కలిశాయి!


తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సారీ కలిశారు. అయితే వేదిక మీద కాదండోయ్. వేదిక బయట! రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పర్యటన సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చోటుచేసుకున్న స్నేహపూరిత వాతావరణం, ఆదివారం నాటి అలయ్ బలయ్ సందర్భంగానూ చూస్తామనుకున్న వారిని, ఆ ఇద్దరు సీఎంలు కొద్దిమేర నిరాశకు గురి చేశారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆదివారం జల విహార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబునాయుడు, కేసీఆర్ లు హాజరు కానున్నారన్న సమాచారంతో రెండు రాష్ట్రాల్లో మెజార్టీ ప్రజలు టీవీల ముందే కూర్చున్నారు. అయితే తొలుత కార్యక్రమానికి హాజరైన కేసీఆర్, చంద్రబాబు వచ్చేలోగానే అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈలోగానే చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. ఆలోగానే కేసీఆర్ జలవిహార్ బయటకు వచ్చేశారు. అయితే ప్రధాన ద్వారం బయటే ఇద్దరు నేతలు ఒకరినొకరు పలుకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మరికొంతసేపు ఉండమంటూ దత్తాత్రేయ చేసిన వినతిని సున్నితంగా తిరస్కరించిన కేసీఆర్, తనకు వేరే కారక్రమాలున్నాయంటూ వెళ్లిపోయారు. చంద్రబాబు లోపలికి అడుగుపెట్టారు. అయితే ఈ సన్నివేశాన్ని గవర్నర్ నరసింహన్ వీక్షించలేకపోయారు.

  • Loading...

More Telugu News