: దోమలందు మంచి దోమలు వేరయా!
పురుషుల్లో పుణ్యపురుషులున్నట్టే...దోమల్లో కూడా మంచి దోమలు ఉన్నాయండోయ్. బ్రెజిల్ లో శాస్త్రవేత్తలు మంచి దోమలను ఊరుమీదికి వదిలారు. ప్రపంచంలో అత్యధికంగా డెంగీ కేసులు బ్రెజిల్ లోనే నమోదవుతాయి. 2009-14మధ్య బ్రెజిల్ లో 3.2 మిలియన్ల డెంగీ కేసులు నమోదుకాగా, అందులో 800 మృతి చెందారు. దీంతో బ్రెజిల్ శాస్త్రవేత్తలు డెంగీను తగ్గించేందుకు పలు పరిష్కారాలు కనుగొన్నారు. అయినా పూర్తి స్థాయిలో డెంగీ అదుపులోకి రాలేదు. దీంతో సమస్యకు మూలకారణాలపై దోమల్నే కొత్తరకంగా ఉత్పత్తి చేసి వదిలితే? అని ఆలోచించి, డెంగీ లక్షణాలను తగ్గించే వోల్బాచియా అనే బాక్టీరియాను దోమల్లోకి పంపి ఈ దోమలను జనాల్లోకి వదిలారు. ఈ బాక్టీరియా వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదని, అది కేవలం డెంగీ లక్షణాలను వ్యాపించకుండా చేస్తుందని వారు స్పష్టం చేశారు. దోమలు పిల్లలు పెట్టి వాటి సంతతిని వృద్ధి చేసుకుని డెంగీకి చెక్ పెడతాయని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. అందుకే బ్రెజిల్ లోని రియో డీ జెనీరో నగరంలో పదివేల దోమలను వదిలారు. వీటి ఫలితాలు రావడమే తరువాయి!