: రాజధానికి లక్ష ఎకరాలు ఎందుకో ముందు చెప్పండి!: శైలజానాథ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం విజయవాడ పరిసరాల్లో లక్ష ఎకరాల భూమిని సేకరించాల్సిన అవసరం ఉందా? అని మాజీ మంత్రి శైలజానాథ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజధాని పేరిట సేకరిస్తామని చెబుతున్న లక్ష ఎకరాల భూమిని ఎలా? ఎందుకు? వినియోగిస్తారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు బంగారం పండిస్తున్న భూముల్లో రియల్ వ్యాపారాన్ని తాము సమర్థించలేమని ఆయన స్పష్టం చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించదని ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి టీడీపీ నేతలు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన మండిపడ్డారు.