: పోలవరం మేమే పూర్తిచేస్తాం: బాబు
ఈ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతుల నీటి కష్టాలు తీరినట్టేనని అన్నారు. రాష్ట్ర విభజన వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆయన మరోసారి చెప్పారు. రైతు, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానన్న హామీని నిలబెట్టుకుంటానని ఆయన స్పష్టం చేశారు. రుణమాఫీకి ఆర్బీఐ కూడా అడ్డుకట్ట వేసిందని తెలిపిన బాబు, ఇతర రాష్ట్రాలు ఏమంటాయోనని కేంద్రం సహాయం చేసేందుకు వెనకడుగు వేస్తోందని చెప్పారు. రైతులను రుణ విముక్తులను చేసి, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని హామీ ఇచ్చారు. పండగలప్పుడు పేదలకు సగం ధరకే జనతా వస్త్రాలు అందిస్తామని, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని ఆయన తెలిపారు. చాగలనాడు పథకం పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. కరవు శాశ్వత నివారణకు నీరు-చెట్టు కార్యక్రమం ప్రజలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.