: తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన '108' సర్వీసులు... ఆందోళన దిశగా ఉద్యోగులు


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా '108 వాహనాలు' నిలిచిపోయాయి. డీజిల్ కొరత కారణంగా గత కొన్ని రోజులుగా '108' సర్వీసులను క్రమంగా తగ్గించేస్తున్నారు. శనివారానికి సమస్య తీవ్రరూపం దాల్చి రాష్ట్ర వాప్తంగా 108 సర్వీసులు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో 15 వాహనాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 14 వాహనాలు, నల్గొండ జిల్లాలో 20 వాహనాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాలలో 8 వాహనాలు నిలిచిపోయాయి. డీజిల్ కొరత ఉందని జీవీకే గ్రూపుకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదని '108' సిబ్బంది వాపోతున్నారు. '108' నిర్వహణ సేవలు గత కొన్నేళ్లుగా జీవీకే సంస్థ నిర్వహిస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన బకాయిలు కొన్నాళ్లుగా తమకు అందటం లేదని... దీంతో తాము కూడా చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని జీవీకే యాజమాన్యం అంటోంది. తెలంగాణ ప్రభుత్వానికి, జీవీకే సంస్థకు ఉన్న అవగాహన లోపం వల్ల తాము కొన్నాళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని '108' ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. తమకు కొన్ని నెలలుగా జీతభత్యాలు కూడా సరిగ్గా అందటం లేదని వారు చెబుతున్నారు. 108 సర్వీసులు నిలిపివేయడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నట్టు సమాచారం. ఇదే పరిస్థితి కొనసాగితే, తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన చేయాలని తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం భావిస్తోంది.

  • Loading...

More Telugu News