: జయలలితను తమిళనాడు జైలుకు తరలించండి: కేంద్రాన్ని కోరనున్న కర్ణాటక
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడ్డ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ఆమె సొంత రాష్ట్రంలోని జైలుకు తరలించాలని కర్ణాటక సర్కారు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించనుంది. అదేంటి, జైల్లో ఉన్న జయలలిత కర్ణాటక ప్రభుత్వానికి కలిగిస్తున్న ఇబ్బంది ఏమిటనేగా మీ ప్రశ్న. ఒక పది రోజులు వెనక్కెళితే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. అసలు జయలలిత కేసుకు, కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో వాద, ప్రతివాదులుగా జయలలిత, కరుణానిధి పార్టీ ఉన్న నేపథ్యంలో తమిళనాడులో జరిగే న్యాయవిచారణపై రాజకీయ ప్రభావం పడనుందన్న ఓ పక్షం వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు, ఈ కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేసింది. అయితే, మొన్న జయలలిత కేసు తుది విచారణ సందర్భంగా బెంగళూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నగర పోలీసులతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలను కూడా కర్ణాటక రంగంలోకి దించాల్సి వచ్చింది. పర్యవసానంగా ప్రభుత్వానికి భారీ ఎత్తున వ్యయమైంది. మరోవైపు శుక్రవారం అనారోగ్యానికి గురైన జయలలితకు ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. మామూలుగా పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలకు ఇంటి భోజనం అందించేందుకు నిబంధనలు ఒప్పుకోవు. జయలలితకు ఏదైనా జరిగితే, తమపై నిందలు పడతాయని కర్ణాటక సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. వచ్చే వారంలో జయలలిత బెయిల్ పిటిషన్ పై విచారణ సత్వరమే పూర్తి కావడంతో పాటు బెయిల్ మంజూరైతే ఫరవాలేదని ఆయన చెప్పారు. విచారణ ఆలస్యమైనా, బెయిల్ రాకున్నా, ఆమెను తమిళనాడుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమకు సంబంధించని కేసులో జయలలితకు ఏదైనా జరిగితే తామెందుకు మాట పడాలన్నది కర్ణాటక భావన.