: బీజేపీ, ఎన్సీపీల మధ్య ఎదో జరుగుతోంది: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే
భారతీయ జనతా పార్టీ, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల మధ్య ఏదో జరుగుతోందని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. శివసేనకు నమ్మకద్రోహం చేసిన బీజేపీ ఎన్సీపీతో పొత్తు పెట్టుకునే దిశగా సాగుతోందని ఆయన ఆరోపించారు. దోస్తీ ముగిసిన కొన్ని గంటల్లోనే బీజేపీ, ఎన్సీపీల మధ్య చర్చలు మొదలయ్యాయని శుక్రవారం ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ధవ్ ఆరోపించారు. ‘‘ఎన్నికల్లో మేం మెజార్టీ సీట్లను గెలుస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మాకు ఎవరి మద్దతు అవసరం లేదు. పాతికేళ్ల మైత్రికి బీజేపీనే కటీఫ్ చెప్పింది. ప్రస్తుతం ఎన్నికల తర్వాత పొత్తు గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ నమ్మక ద్రోహానికి పాల్పడుతోంది. బీజేపీ, ఎన్సీపీలు రెండూ, తమ తమ భాగస్వామ్య పక్షాలను వదిలేసిన మరుక్షణం నుంచే చర్చలు మొదలుపెట్టాయి’’ అని ఆయన ఆరోపించారు. తమతో పొత్తును వదులుకోవడం ద్వారా బీజేపీ, తమకే కాక రాష్ట్ర ప్రజలకు కూడా నమ్మక ద్రోహం చేసిందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు.