: ఈ ఏడాది ఎన్ని తలలు పగుతాయో?


దసరా ఉత్సవాలంటే దేశం మొత్తానిదో తీరు, కర్నూలు జిల్లా దేవరగట్టుదింకో తీరు. అమ్మవారిని ప్రార్థించడం, ఆయుధపూజ చేయడం, రావణ దహనంతో దేశంలో కోలాహలం నెలకొంటే, దేవరగట్టులో మాత్రం కర్రల ఉత్సవ కోలాహలం కనిపిస్తుంది. దేవరగట్టులో కొలువై ఉన్న మాలమల్లేశ్వరుడి కల్యాణోత్సవం ప్రతిష్ఠాత్మకంగా జరుపుతారు గ్రామస్థులు. ఈ ఉత్సవం ముగిసిన తరువాత ఉత్సవ మూర్తిని ఊరేగించేటప్పుడు, దానిని స్వాధీనం చేసుకునేందుకు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు తీవ్రంగా గాయపడతారు, కొన్నిసార్లు ప్రాణాలు సైతం కోల్పోతుంటారు. ఈ ఉత్సవం పట్ల మానవతావాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాక్షస క్రీడను ఆపాలంటూ న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దీంతో ఉత్సవాల్లో ఎలాంటి ఉద్రిక్తతలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. గ్రామస్థులు మాత్రం ఈ ఉత్సవాన్ని చాలా సంబరంగా చేసుకుంటామని, ఇందులో ఆవేశకావేషాలకు తావులేదని చెబుతున్నారు. కానీ గతంలో చోటుచేసుకున్న సంఘటనల దృష్ట్యా పోలీసులు గ్రామంలోని ప్రతి ఇంటినీ తనిఖీ చేశారు. ఇనుప చువ్వలు, మేకులు కొట్టిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. సాధారణ కర్రలు మాత్రమే సంబరంలో వినియోగించాలని ఆదేశించారు. రక్తపాతం జరిగితే చూస్తూ ఊరుకోమని, పండగను సరదాగా చేసుకోవాలి కానీ, పండగైపోయాక బాధపడేలా జరగకూడదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఎన్ని తలలు పగులుతాయోనని మానవతా వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News