: ఆ 'భూత్ బంగ్లా' వైపొస్తే చాలు ఇక అరెస్టు చేస్తారు!
హైదరాబాదులోని బేగంపేట కుందన్ బాగ్ లో భూత్ బంగ్లా అంటూ ఫేస్ బుక్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న ప్రచారానికి ఆకర్షితులై ఆ ఇంటి దరిదాపులకి వస్తే కటకటాలపాలు కావాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కుందన్ బాగ్ లోని ఉమానగర్ ప్రాంతంలో అమెరికాలో ఉంటున్న శారద పెద్ద కుమార్తె జయప్రద, ఆమె ఇద్దరు కుమార్తెలు నివాసం ఉండేవారు. భర్త నుంచి విడిపోయిన జయప్రద, ఆమె ఇద్దరు కుమార్తెలు మానసిక క్షోభతో మరణించారు. ఆ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలు వారు మరణించి ఉండడం గమనించి దొచుకెళ్లిపోతూ పోలీసులకు పట్టుబడ్డారు. విచారణలో ఆ ఇంట్లో మూడు శవాలు ఉన్నాయని చెప్పారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు, వారు మానసిక ఆందోళనతో మరణించారని తేల్చారు. అమెరికాలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. వారు వచ్చి మరణించిన కుటుంబ సభ్యులకు అంత్యక్రియలు పూర్తి చేశారు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లు ఆ ఇంటిపై పడ్డాయి. ఖరీదైన భవంతిని కారుచౌకగా కొట్టేసేందుకు ప్లాన్లు వేశారు. ఈ భవనంలో దెయ్యాలున్నాయని ప్రచారం మొదలు పెట్టారు. అయినప్పటికీ ఆ కుటుంబ సభ్యులు దిగిరాకపోవడంతో, ఫేస్ బుక్ లో భూత్ బంగ్లా అంటూ ఓ పేజ్ క్రియేట్ చేశారు. అక్కడ దెయ్యాలున్నాయని ప్రచారం చేయడం ప్రారంభించారు. కావాలంటే వచ్చి చూసుకోవాలంటూ సవాళ్లు విసిరారు. దీంతో యువకులు దానిని చూసేందుకు అర్ధరాత్రుళ్లు వస్తూ హల్ చల్ చేస్తున్నారు. అరుపులు కేకలతో చుట్టుపక్కల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజుల క్రితం పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయినా యువకుల తీరు మారకపోవడంతో గత రాత్రి దెయ్యాలంటూ హల్ చల్ చేసిన యువకుల్ని రిమాండుకు తరలించారు. ఎవరైనా ఈ ఇంటి చుట్టూ తిరిగినట్టు తెలిసినా, పట్టుబడినా కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.