: మోడీ సవాలును స్వీకరించి, 90 లక్షల మందిని సవాలు చేసిన కమల్ హాసన్
'స్వచ్ఛ భారత్' కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ విసిరిన సవాలును బహుభాషా నటుడు కమల్ హాసన్ స్వీకరించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రధాని తనను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలని అన్నారు. పారిశుద్ధ్యంపై గత 20 ఏళ్లుగా తాను పని చేస్తున్నానని ఆయన తెలిపారు. తనతోపాటు అభిమానులు కూడా సామాజిక సేవలో పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. 'స్వచ్ఛ భారత్' ప్రజల పని అని ఆయన స్పష్టం చేశారు. తాను అందులో భాగమని తెలిపిన ఆయన, దీనిని రాజకీయానికి వాడుకోవద్దని సూచించారు. తనను ప్రధాని సవాలు చేస్తే తాను 90 లక్షల మంది భారతీయులను సవాలు చేస్తున్నానని, అందరూ 'స్వచ్ఛ భారత్' లో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తన అభిమానులంతా ఇందులో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.