: లాయర్ ను చూసి పెట్టమని జిల్లా జడ్జినే అడిగిన 'మొద్దు శీను' నిందితుడు ఓంప్రకాష్
మొద్దు శీను హత్య కేసులో జీవితఖైదును అనుభవిస్తున్న నిందితుడు ఓం ప్రకాష్ తన తరపున వాదించేందుకు ఓ లాయర్ ను చూసి పెట్టాలని సాక్షాత్తూ జిల్లా జడ్జినే డైరెక్ట్ గా అడిగేశాడు. గురువారం ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా నెల్లూరు సెంట్రల్ జైలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా జడ్జి కనకదుర్గారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ఓంప్రకాష్ జడ్జితో మాట్లాడుతూ, మొద్దుశీను హత్యకేసులో నిందితుడిగా శిక్ష అనుభవిస్తూ వరంగల్ జైలు నుంచి నెల్లూరుకు వచ్చానని తెలిపాడు. తన తరపున కేసును వాదించేందుకు న్యాయవాదులు రూ.5 లక్షల ఫీజు అడుగుతున్నారని, అంత ఫీజు తాను ఇచ్చుకోలేనని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎలాగైనా లాయర్ ను అరేంజ్ చేయలంటూ జడ్జిగారి మీద ఒత్తిడి తీసుకువచ్చాడు. హఠాత్తుగా, ఓంప్రకాష్ ఇలా అడగడంతో జైలు అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. 2008 సంవత్సరం నవంబర్ 9న మొద్దుశీను జైలు గదిలో నిద్రిస్తుండగా అదే సెల్లో వున్న ఓంప్రకాష్ వ్యాయామం చేసే డంబుల్స్ తో తలమీద మోది అతనిని దారుణంగా హత్య చేశాడు. పరిటాల రవి హత్యకేసులో ప్రధాన నిందితుడు ఇలా తోటి నిందితుడి చేతిలో హత్యకు గురికావడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.