: ఇంచియాన్ లో దూసుకెళుతున్న ఇండియా!
ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడలు రేపటితో ముగియనున్నాయి. తొలుత అంతగా సత్తా చాటని భారత క్రీడాకారులు రానురాను మెరుగైన ప్రతిభ చాటుతున్నారు. నిన్నటిదాకా ఎక్కడో కింద స్థానంలో కొనసాగుతున్న భారత్, గురువారం ఒక్కసారిగా తొమ్మిదో స్థానానికి చేరుకుంది. మొత్తం 55 పతకాలతో 9వ స్థానంలో కొనసాగుతున్న భారత్, ఇప్పటిదాకా తొమ్మిది బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఆసియా క్రీడల్లో హాకీలో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్ లో పాక్ ను చిత్తు చేసిన భారత జట్టు బంగారు పతకాన్ని దక్కించుకుంది. కబడ్డీలో ఇటు పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా బంగారు పతకం దిశగా సాగుతోంది. ప్రస్తుతం ఇరాన్ తో జరుగుతున్న ఫైనల్ లో భారత మహిళా కబడ్డీ జట్టు స్పష్టమైన ఆధిక్యంతో బంగారు పతకం దిశగా దూసుకుపోతోంది. గురువారం నాటి 400 రిలే పరుగులో భారత మహిళా జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం నాటి కబడ్డీ ఫైనల్ లో పురుషుల జట్టు కూడా విజయం సాధించే అవకాశాలున్నాయి. నేటి పోటీల్లో భాగంగా భారత్ పతకాల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.